అమ్మ లేని మిత్రుడు

             అమ్మా.. అమ్మా.. అంటూ ఆత్రంగా తలుపు తట్టాను. తలుపు తీసిన అమ్మ.. ఒక్కసారిగా ఆగిపోయి, కళ్ళ నీళ్ళతో.. నా చేయి పట్టుకొని లోనికి తీసుకెళ్ళి.. "ఎన్నాళ్లయిందిరా" అంటూ ఏడ్చేసింది.

     "అమ్మా.. అమ్మ.. వెళ్లి రెండు.. మూడు సంవత్సరాలు కూడా కాలేదు. ఎన్నో  ఏళ్ళు అయినట్లు బాధపడితే ఎలా... చూడు నీ కోసం ఏం తెచ్చానో" అంటూ బ్యాగు విప్పబోతూ.. "మా అమ్మ మంచిది" అంటూ అమ్మ మొహంలోకి చూసి, నవ్వించే ప్రయత్నం చేశాను.

          " చాల్లే సంబడం ఉద్యోగం అని బెంగళూరు వెళ్లావు. కంపెనీ వాళ్ళు పంపారని అటునుండి అటే యూఎస్ఏ కి పోయావు. మళ్ళీ ఇప్పుడు వచ్చావు. కానీ ఇంజనీరింగ్ చదువైనా ఇక్కడ చదివావా అంటే  అదీ లేదు. మీ నాన్న  నిన్ను  తీసుకెళ్లి చెన్నై హాస్టల్లో వేశాడు.

 సరేలే ఇంటి భోజనం తిని ఎన్నాళ్లయిందో" అంటూ నా చేతికి టవల్ ఇచ్చి బ్యాగు ని తీసుకొని రూమ్ లో పెట్టింది. అమ్మ చూపిస్తున్న  అభిమానానికి ఆనంద పడుతూ... అమ్మలంతే  అనుకుంటూ... వాష్ రూమ్ లోకి వెళ్ళాను.

          అమ్మ చేతి వంట మహత్యమేమో... తిన్న వెంటనే బాగా నిద్ర పట్టేసింది. మళ్ళీ తిరిగి లేచేసరికి అమ్మ కాఫీతో రెడీ.   టైం చూస్తే సాయంత్రం ఆరు అయింది. ఇంతసేపు నిద్రపోయానా  

అనుకుంటూ.."అలా తిరిగి వస్తానమ్మా" అంటూ బట్టలు మార్చుకొని  బయటకు వచ్చాను.  

ఇప్పుడిప్పుడే టౌన్ నుండి సిటీకి మారుతున్న ఊరిని చూస్తూ అలా కాస్త దూరం నడిచాను.  

ఫ్రెండ్స్ కి నేనొచ్చానని ఫోన్ చేద్దామని సెల్ చేతిలోకి తీసుకునే సరికి ఎవరిదో పెద్ద కేక వినపడింది.

అది.. కాస్త మరుగు ప్రదేశం. ఎక్కువ చెట్లు ఉన్నాయి.   చీకటి పడింది కదా.. ఆ ప్రదేశంలో మరింత చీకటిగా ఉంది. ఏంటా అని పరికించి చూసాను.

      ఒకతను చెట్టు కింద కూర్చొని "ఆకలి.. ఆకలి" అంటూ  పెద్దగా ఏడుస్తూ.. అరుస్తున్నాడు.

నాకు లోనేదో కెలికినట్లు అయింది. పిచ్చివాడేమోనని భయం కూడా వేసింది. మళ్ళీ అతను ఆకలి ఆకలని పెద్దగా ఏడుస్తూ అరుస్తూనే ఉన్నాడు. దూరంగా నిలబడి సెల్లు లైట్ వేసి చూసాను. చింపిరి జుట్టు చిరిగిన గుడ్డలు.. మనిషి భయం గొలిపేలా ఉన్నాడు. అయినా ఆకలి అనగానే ఏదోలా అనిపించింది. పరిగెత్తి వెళ్లి దగ్గర లో ఉన్న అంగడిలో బిస్కెట్ ప్యాకెట్లు కొని అక్కడికి వచ్చాను. చేతికి ఇద్దామంటే భయం వేసింది. కాస్త దగ్గరికి పోయి విసిరేసాను. అతను అవి పట్టుకొని వాటిని నలిపేసి.. కాగితం చించేసి ఆబగా తింటున్నాడు. అంతలో నీళ్గు  అవసరం గుర్తుకు వచ్చి అంగడి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి.. వాటర్ బాటిల్ తెచ్చాను. ఇప్పుడు కాస్త దగ్గరికి వెళ్లి పెట్టాను. అతను నాకేసి చూడకుండా బిస్కెట్లను ఎలా పడితే అలా తింటూ నీళ్ళని గట గట తాగేస్తున్నాడు.

             కాస్త ధైర్యం వచ్చి ఇంకొంచెం దగ్గరికి వెళ్లి లైట్ వేసి చూసాను ఎక్కడో చూసిన మొహం...

ఎక్కడా..! అని ఆలోచిస్తూ కాస్త దూరం వచ్చి, లక్ష్మణ్ కి ఫోన్ చేశాను."ఎక్కడున్నావ్రా  శ్రీకాంత్ 

బెంగళూరేనా" అంటూ లక్ష్మణ్ అడిగారు.

"కాదురా మన ఊరులోనే" అంటూ ఎక్కడున్నానో చెప్పాను.

         "సరే అక్కడే ఉండు నేను వస్తాను", అన్నాడు. కాసేపటికి లక్ష్మణ్ వచ్చాడు. విషయం చెప్పాను. "సరే చూద్దాం రా" అన్నాడు. ఇద్దరం ఉన్నాం కదా ధైర్యంగా దగ్గరికి వెళ్లాము. చీకట్లో సరిగా కనబడటం లేదు. సెల్ లైట్ వేసి, పరిశీలనగా చూసాను.  

        "రేయ్ లక్ష్మణ్ వాడు నా క్లాస్మేట్ రా"అంటూ అరిచాను.    లక్ష్మణ్ నా వైపు  ప్రశ్నార్థకంగా చూశాడు.   నా అరుపుకి అతను ఇద్దరి వైపు బెరుకుగా చూశాడు.

             లక్ష్మణ్ అతనితో "అన్నం తింటావు కదా" అడిగాడు అతను తల ఉపాడు.   వెంటనే తన స్నేహితుడు ప్రసాద్ కి ఫోన్ చేసి "మీల్స్ పార్సిల్ ఒకటి త్వరగా తీసుకురా.. శ్రీకాంత్ ఇంటి దగ్గరలో ఉన్నాము. అక్కడికి వచ్చి ఫోన్ చేయ్", చెప్పాడు లక్ష్మణ్.

             ఈ లోపల లక్ష్మణ్ అతని వివరాలు నన్ను అడిగాడు. "నీవు.. ప్రసాదు, నాకు హైస్కూల్లో పరిచయం, వీడు ఒకటి నుండి ఐదు వరకు చదివిన స్కూలులో పరిచయం. వాడి పేరు రవి. అమ్మ కూడా ఉన్నట్లు గుర్తు. మొహం కూడా లీలగా గుర్తుకు వస్తుంది కానీ, అంత క్లారిటీ లేదు", చెప్పాను.

            "మా వీధికి రెండు వీధుల అవతల ఒక కాలువ ఉంది కదా... అక్కడ ఒక సందు ఉంది. ఆ సందులో వీళ్ళ ఇల్లు. నాకు కొంత కొంతగా గుర్తుకు వస్తుంది" అన్నాను.

          మాటల్లో... ప్రసాదు అన్నం ప్యాకెట్ తెచ్చి ఇస్తూ.. "ఏంట్రా విషయం" అన్నాడు. ఏమీ మాట్లాడకుండా అన్నం పొట్లం అతనికి ఇచ్చి తినమని మరలా అక్కడి నుండి బయటకు వచ్చాము. విషయం తెలుసుకున్న ప్రసాద్ "దగ్గరే అన్నావుగా అతను.. తినే లోపల ఆ వీధిలోకి పోయొద్దాంరా అతని గురించి కనుక్కుందాం",   అన్నాడు.

        రవి ఎవరో తెలియకపోయినా... వారిద్దరి స్పందన చూసి నాకు సంతోషం వేసింది. ఆ ఇరుకు వీధి చేరుకొని లోపలికి నడిచాం. సైకిలో.. స్కూటరో పడుతుంది అంతే... ఆటో కూడా ఆ సందులోకి రాలేదు. స్కూటర్ అయినా లోపలికి వెళ్తే అలాగే వెనక్కి రావాలి తప్ప తిప్పుకోలేరు. అంత సన్న వీధి అది.   ఓ పది... పదిహేను ఇళ్ళు ఉన్నాయి. దాదాపుగా అన్నీ పూరి గుడిసెలే.

                బయట కూర్చుని మాట్లాడుకుంటున్న వాళ్లని అడిగాను. "ఇక్కడ రవి అని.. అమ్మ కూడా ఉండేవారు,"అంటూ చిన్నగా గొణిగాను.

"ఆడా ఆడే‌క్కడో తాగి పడి ఉంటాడు. ఆడమ్మ ఎప్పుడో పోయింది. అప్పటినుండి ఈడు దేశ దిమ్మరి అయిపోయిండ్లా.. ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో ఆడికే తెలియాల. ఆడితో మీకేంటి పని నాయన" అన్నది. అక్కడ ఉండే ఆమె.

         "లేదమ్మా చిన్నప్పుడు కలిశాను. తర్వాత లేదు. అందుకని ఒకసారి చూద్దామనీ..." చెప్పాను.  

"అవునా అయ్యా... అద్దో ఆ కూలిపోయిన ఇంట్లో ఉంటాడు అంటూ.." ఆ గుడిసె వైపు చూపించింది. గుడిసే ఒకవైపు ఒరిగిపోయి ఉంది. తలుపు ఊడిపోయి ఉంది. మరలా ఆమె..."అయ్యా ఆడు పూర్తిగా సెడిపోయాడు. ఏ పని సేయడు. ఎవర్నో ఒకర్ని అడిగి... దాంతో తాగి తోంగుంటాడు. ఆడితో మీకెందుకయ్యా.. ఎల్లండి బాబు," అంది.

          ఏం మాట్లాడుకుండా అక్కడి నుండి వచ్చేసాము. మళ్లీ ఆ చెట్టు కాడికి పోయి చూస్తే... వాడు అక్కడే చెట్టు మొదలునానుకొని నిద్రపోతున్నాడు. లక్ష్మణ్ నా భుజం పైన చేయి వేసి వెనక్కి తీసుకొచ్చాడు.

          రాత్రి నిద్ర పట్టలేదు. 'ఇంట్లో వాళ్ళ సంరక్షణ లేకపోతే మనుషులు ఇలా అయ్యే అవకాశం ఉందా..!   అమ్మ ఉంటే వాడినలా అవనిచ్చేదా..! ఆలోచిస్తూ పడుకుంటే.. ఎప్పుడు నిద్రపోయానో...

              ఉదయం పది అయింది. నేను మళ్ళీ లేచి ఆ గుడిసెల దగ్గరికి వెళ్లి వాడు ఉన్నాడా... లేడా అని చూశాను. ఆ ఇళ్ళు తప్ప అన్ని గుడిసెలు తలుపులు వేసి ఉన్నాయి. అందరూ పనులకు వెళ్లి ఉంటారు అనుకున్నా.. వాడి విరిగిన తలుపు నెట్టాను. అది కిర్రుమంటూ చప్పుడు చేసి దారి ఇచ్చింది. లోన అంతా మట్టే. ఏ సామాన్లు లేవు. ఒక చింకి చాప.. మాసిపోయిన దిండు లాంటిది మూలన పడి ఉన్నాయి. కరెంట్ అంటూ ఏమీ లేదు. వాడు అలానే మట్టి మీద పడుకుని ఉన్నాడు. కాసేపు వాడి మొహంలోకి అలాగే చూశాను. పరుగు పందెంలో వాడు నన్ను వీపు మీద ఎక్కించుకొని పరిగెత్తేవాడు. నన్ను పట్టుకున్న ఆ చేతులు నిస్త్రాణంగా పడి ఉన్నాయి. కాల్చిన తాటి దబ్బ ఇద్దరం పంచుకున్నది గుర్తొచ్చింది. తగాదాలలో వాడు నా వైపు ఉండి అవతల వాళ్ళతో పోట్లాడిన విషయాలన్నీ గుర్తు వచ్చాయి. నెమ్మదిగా అక్కడ నుండి బయటకు వచ్చాను.

          మాకు ఒక వాట్సప్ సమూహం ఉంది. ఆరు నుండి పదవ క్లాస్ వరకు చదివిన క్లాస్మేట్స్  కొందరు కలిసి.. ఒక వాట్సాప్ సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారిలో ఒకరిద్దరూ ఒకటో క్లాస్ నుండి నాతో చదివిన వాళ్ళూ ఉన్నారు.

       నేను రాత్రి జరిగిన విషయం... వాడితో ఉన్న పరిచయం... వాడి ఇప్పటి స్థితి. అంతా పోస్ట్ చేశాను. లక్ష్మణ్.. ప్రసాద్ లు కూడా జరిగిన విషయం అందులో పెట్టారు. దీని గురించి సమూహ మిత్రులను ఎలా చేస్తే వాడు బాగుపడతాడు అని సలహా అడిగాను. కొందరు ఏదైనా ఉద్యోగం చూద్దాం అన్నారు. కొందరు మొదట వాడు బాగుపడాలి కదా అన్నారు. వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేరుద్దాం అనుకున్నారు. తలా కొంచెం వేసుకుంటాం. అంటూ మద్దతు ఇచ్చారు. ఎక్కడా... ఎలా అనే విషయం చర్చకు వచ్చింది. "నాకు బెంగళూరులో ఉద్యోగం కదా.. అక్కడ చేర్పిస్తే.. నేను పోయి చూస్తూ ఉంటాను", అన్నాను. అందరూ ఓకే అంటూ ఒప్పు కున్నారు.

            చేర్చే విధానం.. ఫీజు.. ఎన్ని రోజుల్లో రికవరి అవుతారు.. తదితర విషయాలు సేకరించడంలో అందరూ సహాయపడ్డారు. ఎలాగోలా రవిని తీసుకెళ్లి సెంటర్లో చేర్చాము. నేను అప్పుడప్పుడు పోయి చూసి వస్తున్నాను. ఓ రెండు నెలల తర్వాత గానీ.. వాడు నన్ను గుర్తు పట్టలేదు. చిన్నగా మనుషుల్లో కలవడం మొదలుపెట్టాడు. నేను మా సమూహంలో వాడి విషయాలన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఐదు నెలల తర్వాత వాడికి ఏదైనా ఉద్యోగం వెతుకుదాం అంటూ సమూహంలో చెప్పాను. అలాగే చూద్దాం అన్నారు. అందరూ వెల్ సెటిల్డ్ కాబట్టి వాడికి చిన్న ఉద్యోగం ఏదైనా చూడకపోతామా అన్న ధైర్యం ఉంది.

              లక్ష్మణ్ ఒకటి చెప్పాడు. "నాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది. రవికి బాగైన తర్వాత

అతనిని అక్కడ కేర్ టేకర్ గా పెట్టిస్తాను. వాళ్లకు కూడా మనిషి ఒకరు కావాలంట", అని చెప్పాడు.

         ఆరు నెలలు గడిచాయి రవి దగ్గరికి వెళ్లాను. "నీ రుణం ఎలా తీర్చుకోవాలో.. నాకు తెలీదు శ్రీకాంత్" అంటూ కన్నీళ్ళతో నమస్కరించాడు. నేను అడ్డంగా తలపుతూ వాడి చేయి పట్టుకుని "నా రుణం తీరాలంటే.. నన్ను ఉప్పెక్కించుకొని పరిగెత్తరా" అంటూ నవ్వాను".. వాడిని చూస్తూ. వాడూ నవ్వాడు.

                   "రవీ...! అమ్మ చనిపోయాక నీవలా తయారయ్యావు. నీకు ఒక పని చెప్తా.. చెస్తావా..  

ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ అమ్మలు ఎందరో ఉన్నారు. మీ అమ్మని వారిలో చూసుకుంటూ అక్కడ వారికి తోడుగా ఉంటావా...! అక్కడే ఉంటూ ప్రైవేటుగా చదువుదువు గాని" అని అడిగాను. వాడు ఆనందంతో తలూపాడు.

               ఇప్పుడు వీడికి చాలా మంది అమ్మల తోడు దొరుకుతుంది. ఇక దిగులు లేదు, వీడి బాట రాచబాట అవుతుంది అని అనుకుంటూ తృప్తిగా అక్కడ నుండి బయలుదేరాను.

సంపుటి 44 · సంచిక 5 · సెప్టెంబర్ – అక్టోబర్ · 30 సెప్టెంబర్, 2026