సంపాదకీయం
సత్యం వద, ధర్మం చర అని నిర్దిష్టంగా చెప్తుంది వేదం, అదే విషయాన్ని 'కాంతా సమ్మితంగా ' చెప్పి ఒప్పిస్తుంది కావ్యం అని నానుడి. ఎంత కాంతా సమ్మితంగా చెప్పినా, జరుగుతున్న దురాచారాలని ఓ పట్టాన ఏ సంఘమూ ఒప్పుకోదు. ఏదో విధంగా అది తప్పు కాదని వాదిస్తుంది. అటువంటి సంఘ దురాచారాన్ని, అప్పట్లో తీవ్రంగా ప్రబలి ఉన్న కన్యా శుల్కాన్ని అంత తీవ్రంగానూ ఖండించారు గురజాడ వారు. ఆ విమర్శ గిరీశం లాంటి anti hero అంటే ఖల నాయకుడు అని చెప్పచ్చేమో, వాడి ద్వారా ఎత్తి చూపించి ఆ నానుడి నిజమనిపించారు. ఆ నాటకం చదివిన ప్రతి ఛాందసుడూ, నిజమే సుమా అనుకునేటట్లు చేశారు, తన కాలపు సంఘానికి ఎంతో సేవ చేశారు.
గురజాడ వారి కన్యాశుల్కంలో మరో గమ్మత్తు: సాధారణంగా ఒక 'నాయకుడి ' పాత్ర ద్వారా కథంతా నడుస్తుంది, చదువరి తనలో తను ఆ నాయకుడై, ఆ పాత్ర విజయాన్ని కోరుకుంటాడు. ఆ నాయకుడి విజయంలో తన విజయం ఊహించుకుంటాడు. చిత్రీకరణలో కూడా అదే జరుగుతుంది. ఆ నాయకుడి అపజయం, ఆ నాయకుడి పాత్ర వేసిన నటుడి అపజయం సహించలేరు ప్రేక్షకులు. NTR, ANR వంటి వాళ్ళు villain పాత్ర వెయ్యరు, వాళ్ళు వేసే పాత్రలు వేటికీ అపజయం ఉండదు. కానీ కన్యాశుల్కం సినిమాలో, గిరీశం పాత్రని, వీడి కథ సజావుగా సాగిపోతే బావుణ్ణు అనిపించదు, ఆ పాత్రని NTR వేసినప్పటికీ. వాడి జయం కోరరు ప్రేక్షకులెవరూ. నాటకంలో పాత్ర కాకుండా సందేశప్రాముఖ్యత సాధించారు గురజాడ వారు. ఆ విధంగా మరెవరూ ఆ కష్టమైన పని చేసినట్లు కనిపించదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, సెప్టెంబర్ 21 ని గురజాడ దినంగా ప్రకటించడం ఎంతో మంచి పని.
ఇక ఈ సంచికలోని మిగతా విషయాలకొస్తే:
సెప్టెంబర్ 21, గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా, కేదారి రాఘవ మాష్టరు రాసిన 'అతడొక తెలుగు వేగు చుక్క, అభ్యుదయ కవనాల తురుఫు ముక్క' అన్న కవితని ప్రచురిస్తున్నాము.
అప్పలరాజు గారు అమ్మ పడిన బాధలు గుర్తు చేసుకున్నారు
ప్రీతిక సాయి గారికున్న లాంటి నేస్తం అందరికీ ఉంటే ఎంత బావుణ్ణు!
'ఆరంభించరు నీచ మానవులు ' అన్న భర్తృహరి సుభాషితం గుర్తుకు తెచ్చారు వేంకట రామా రావు గారు.
తప్పెవదిది, ఒప్పెవరిది అని ఆలోచించారు రంగనాథ్ గారు
'ధర్మేచ అర్ధేచ ... నా అతిచరామి ' అన్న పెళ్ళినాటి ప్రమాణం పెళ్ళి లోనే మర్చిపోయిన ఒక భర్త గుఱించి రాశారు గౌరి గారు.
మేరా భారత్ మహాన్ అని హుంకరించారు నరసింహం గారు.
గృహిణికి వందనమర్పించారు రాఘవేంద్ర రావు గారు.
చేనేత కళాకారుల బాధలు చక్కగా వర్ణించారు రమేష్ గారు.
కృతజ్ఞత లేనప్పుడు నినాదాలకర్ధం లేదంటున్నరు శ్రీపతి లలిత గారు.
అమ్మంటే ఏమిటో రాశారు శ్రీధర్ గారు
ప్రకృతిలో అమ్మని చూస్తున్నారు కారుణ్య కుమార్ గారు
గుత్తి వంకాయ కూరోయి బావా అని లొట్టలేయించారు యామిని గారు.
ఒక దేశ భక్తి గీతం రాశారు నిర్మల రాజు గారు.
మన కచేరీలకి ఒక ప్రాణం పోసే మృదంగం మీద ఒక చిన్న వ్యాసం రాశారు, New Jersey లో ప్రముఖ మృదంగ విద్వాంసులు V. ప్రకాశ రావు గారు.
సంపాదకులు
