దీపధారి
న్యూ ఢిల్లీ!
ఏప్రిల్! ఉదయం తొమ్మిదిన్నరకే ఎండ మండిపోతూ వుంది. రాష్ట్రపతి భవన్ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఒక అరవై ఏళ్ల వృద్ధుడితో ఏదో ఘర్షణ పడుతూ వున్నారు. తెల్లటి లాల్చీ, పైజామా ధరించి వున్న ఆ పెద్దాయన తన సహజసిద్ధమైన పల్లెటూరి యాసలో తెలుగులో ఏదో చెబుతూ వుంటే, ఆ భాష అర్థంకాని సెక్యూరిటీవాళ్లు అతణ్ణి గదమాయిస్తూ వున్నారు.
ఆరోజు ఉగాది కావడంతో రాష్ట్రపతి తెలుగు రాష్ట్రాలనుండి ‘పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్’ అవార్డులు తీసుకున్న వారి గౌరవార్థం ఒక సన్మాన కార్యక్రమం, విందు ఏర్పాటు చేశారు. పడవల్లాంటి కార్లు వస్తూ పోతూ వుండడంతో సెక్యూరిటీ సిబ్బంది హడావిడిగా వున్నారు. వృద్ధుడు తనను గేటులోపలకు పంపమని వారిని తెలుగులో వేడుకుంటూనే వున్నాడు.
ఆఫీసు పనిమీద రాష్ట్రపతి భవన్ కు వచ్చిన అనంతపురం జిల్లా కలెక్టరు గేటువద్ద సిబ్బందితో ఘర్షణ పడుతూవున్న ముసలాయనను చూశాడు. పార్కింగ్ లాట్ లో డ్రైవరు కారు పార్క్ చేశాక, ఆయన హడావిడిగా గేటు వద్దకు నడుచుకుంటూ వచ్చి, సెక్యూరిటీ ఆఫీసరుతో,“ఎమండీ, ఆయన ఎవరనుకున్నారు? గొప్ప చేనేత సృజనకారుడు. ఈ ఏడాది ‘పద్మశ్రీ’ అవార్డు కూడా అందుకున్నారు. మీరాయనను గేటువద్ద అటకాయించడం బాగాలేదు. వెంటనే ఆయనను లోపలకు పంపండి, మీరిలా రండి ఓబులేసుగారూ” అని వృద్ధుడిని తనతో గేటు లోపలకు తీసుకువచ్చాడు. ముఖంలో కృతజ్ఙతా భావంతో ఓబులేసు కలెక్టరుగారికి నమస్కరించి, ఆయన వెంట నడిచాడు.
“ఓబులేసుగారూ, మిమ్మల్ని ఈరోజు సన్మానానికి రమ్మని ఉత్తరం పంపివుంటారు గదా, అది తీసుకురాలేదా? మీతోబాటూ ఎవ్వరూ రాలేదా?” అన్నారు కలెక్టరుగారు గౌరవంగా.
“లేదు సార్, మా అబ్బాయి గోవిందు వచ్చాడు. వాడితోనే ఆ కాగితం వుంది. మేమిద్దరం ఈ వీధి మొదట్లో ఆటో దిగాము. ఈ పోగ్రాంకు మాకు రెండు పాసులిచ్చినారు. మా కొడుకు స్నేహితుడు కృష్ణ ఈ ఢిల్లీలోనే ఏదో గవర్మెంటుద్యోగం చేస్తా వుండాడు. వాడూ ప్రోగ్రాంకు వస్తాననె. వాడు అవిటోడు కాబట్టి పక్కనే సిటీ బస్సుస్టాపుకాడినుండి వాడిని తీసుకొస్తానని మావాడు పోతూ, నన్ను ప్రోగ్రాంలో వుండమనె, తొందరలో ఆ జాబు మావోడికాడే వుండిపోయింది” అన్నాడు ఓబులేసు.
మరో నెలరోజుల్లో రాష్ట్రపతి అనంతపురం జిల్లాకు ఏదో కార్యక్రమానికి వస్తూవున్నారు. ఢిల్లీలో రెండు రోజుల ట్రైనింగ్ కు వచ్చిన జిల్లా కలెక్టరుగారు, ఆ ప్రోగ్రాం గురించి ప్రెసిడెంటుగారి పి. ఏతో మాట్లాడుదామని రాష్ట్రపతి భవన్ కు వచ్చారు.
“మీరు సన్మానం హాల్లో వుండండి, ఓబులేసుగారూ, మీ అబ్బాయి వస్తాడు” అని హాలుదగ్గర ఆయనను వదలి, కలెక్టరుగారు వెళ్లిపోయారు. సూట్లు, బూట్లు ధరించిన మనుషులు హడావిడిగా తిరుగుతూ వుంటే, ఓబులేసు బిక్కుబిక్కుమని ఆ హాల్లో ఒక మూల కూర్చున్నాడు.
పావుగంట తరువాత గోవిందు, కృష్ణ హాల్లోకి వచ్చి, ఓబులేసు పక్కన కూర్చున్నారు. మరొక అర్థగంటలో కార్యక్రమం ప్రారంభమయింది.
‘మా తెలుగు తల్లిని’ గీతాలాపన తరువాత, సన్మాన కార్యక్రమం ప్రారంభమైంది. లేడీ యాంకరు పద్మ అవార్డు గ్రహీతల ఒక్కొకరి పేర్లూ మైకులో అనౌన్స్ చేసి, వారు స్టేజివద్దకు వస్తున్నప్పుడు వారి ప్రావీణ్యత, వారు సాధించిన విజయాల గురించి చెబుతూవుంది.
కాసేపటికి ‘గుర్రం ఓబులేసు’ అన్న పిలుపు వినబడింది. గగుర్పాటుతో ఓబులేసు స్టేజివైపు నడిచాడు.
“అనంతపురం జిల్లా, ధర్మవరం పట్టణానికి చెందిన గుర్రం ఓబులేసుగారు గొప్ప చేనేత కళాకారులు, పసుపు, ముదురు ఎరుపు రంగులో ఆయన నేసిన పెళ్లి పట్టుచీరలు ప్రఖ్యాతి గాంచాయి. అంచులలో నెమళ్లు, ఏనుగులు, దేవుళ్ల బొమ్మల డిజైన్లు నేయడంలో వీరు ఎంతో ప్రావీణ్యత గలవారు. ఈ ఏడాది చేనేత రంగంలో పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు” అని యాంకరు చెబుతూ వుంటే ఓబులేసుకు కాస్తా గర్వంగా అనిపించింది.
కొద్దిగా వంగి రాష్ట్రపతికి నమస్కారం చేశాడు. రాష్ట్రపతి అతనికి ప్రతినమస్కారం చేసి శాలువా కప్పి, మెమెంటో, చెక్ అందజేశారు.
అందరి సన్మానం ముగిసేసరికి గంటసేపు పట్టింది. ఈలోగా ఆ హాల్లో కూర్చున్న వారందరికీ ఉగాది పచ్చడి, మంచినీళ్లు సర్వ్ చేశారు. రాష్ట్రపతి కూడా తెలుగువారు కావడంతో ప్రోగ్రాం రంజుగా వుంది.
పద్మభూషణ్ అందుకున్నవారు ఒకరొకరిగా వచ్చి తాము సాధించిన విజయాలను, తమ అనుభవాలను ఏకరువు పెట్టారు. తరువాత పద్మశ్రీ గ్రహీతలు మాట్లాడవలసిన తరుణం ఆసన్నమైంది.
గేటు వద్ద సెక్యూరిటీ వాళ్లు ఓబులేసును అటకాయించిన వైనం రాష్ట్రపతిగారి చెవిలో ఎవరో వూదేశారేమో, ఆయన చిరునవ్వుతో“నాకు మన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే చేనేతకళ అంటే చాలా ఇష్టం. ముందుగా చేనేత సృజనకారుడు ఓబులేసుగారిని తన అనుభవాలను మనతో పంచుకోవలసినదిగా కోరుతున్నాను” అన్నారు తెలుగులో.
ఓబులేసు కొద్దిగా భయపడుతూ వేదిక వద్దకు వచ్చాడు. ఆఫీసర్లలో తెలుగువాడైన మూర్తిగారు అతని వాలకం గమనించి,“ఏమీ ఫర్వాలేదు, మీకు తోచిన మాటలు చెప్పండి ఓబులేసుగారూ” అన్నాడు. దాంతో ఓబులేసుకు కొంచెం ధైర్యం వచ్చింది.
ఓబులేసు రాష్ట్రపతికి, వేదికపైవున్న మిగిలిన ప్రముఖులకు ప్రణామం చేసి,“ అందరికీ ఉగాది పండగ సుబాకాంక్షలు. మాది అనంతపురం జిల్లా దర్మోరం. దర్మోరమంటే అనాదిగా పట్టుచీరలకు పేరుగాంచి వుండాదని మీకందరికీ తెల్సు.
మా నాయిన నారాయన గజనేతగాడు. ఆయన కాలంలో ఇప్పటి మాదిర్తో మగ్గాల షెడ్లు, కరెంటు మగ్గాలు, డాబీలు, జకార్డులు లేవు. నెలంతా కష్టపడి ఆరు చీరలు నేస్తే, పది వారాల వడ్లు, నూకలు, చెనిక్కాయ నూనె, కూరగాయలు, నూర్రూపాయలు లెక్క ఇచ్చేవోళ్లు. మా నాయిన మగ్గాలు నేవనేసి బతుకంతా ఎళ్లదీసి, మగ్గాల్లో వచ్చే దుమ్మూ, దూళి పీల్చి, గస, ఆయాసము తెచ్చుకోని, ఆ జబ్బుతోనే చనిపాయె. ఆయనకు మేము ముగ్గురం కొడుకులము, ఇద్దరు కూతుళ్లు. మేమంతా మగ్గాలు నేస్తానే వుండాము పసితనం నిండీ, కూతుళ్లను మంచి ఇండ్లలోనే ఇచ్చినాడు మా నాయన. ఒక అల్లుడు రేషం (పట్టునూలు) యాపారమూ, మరో అల్లుడు చీరలమ్మడం సేస్తా వుండారు.
మా నాయన రెండ్రోజుల్లోనే పట్టుచీర నేసే మొనగాడు. ఒకసారి ఇందిరమ్మ వోట్లప్పుడు దర్మారం వస్తే, ఎమ్మెల్యే మా నాయన నేసిన పట్టుచీర తీసకపోయి కానుకగా ఇచ్చినాడు. ఆ చీర పనితనాన్ని ఆమె బలే పొగిడినారంట.
మా నాయన బతుకంతా కట్టపడినా, రెండు కుంట్ల బూమి సంపాదించలేకపాయె. నేసేపేటలో గవుర్మెంటోళ్లు రెండు కుంట్ల జాగా నాకు పదేళ్లప్పుడు ఇచ్చినారు. దాంట్లో ఇల్లు కట్టకనే మా నాయన గతించిపోయినాడు.
రేషం (పట్టు) మగ్గం పెట్టుకునేదానికి రెండు కుంటలు జాగా చాలదు. ఐనా ఇల్లు కావల్ల. నాకు పార్వతితో పెళ్లయినాకా, మా ఆడది ఎట్టైనా ఇల్లు కట్టుకుంటామని పోరకలాడతా వుండింది.
నాకిద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకు మగ్గాల్లోనే వుండాడు. ఇక్కడికొచ్చిన ఇంకో కొడుకు గోవిందు డిగ్రీ పాసైనాడు. కూతురు యశోద కూడా బాగా సదివి బీఈడీ పాసై టీచరుద్యోగం సేస్తా వుండాది.
వోళ్ల సదూలకూ, రోగాలు, రొష్టులకూ సంపాదించిందంతా కర్సైపోతా వుండాది. నేను మా గురువట్టాటోడు మాదన ఆంజినేయులు కాడికి పోతిని.
“ఓరే ఓబుల్, అందరూ సేస్తా వుండేదే, నువ్వు నేస్తే నీకాదాయం అంతకాడికే వుంటాది. కొత్త విద్య నేర్చుకో, కొత్త డిజైన్లు, బట్టలూ, అంచులూ నెయ్యి. ఆసాములు నీకు మజూరీ డబుల్ చెయ్యకపోతే నన్నడుగు” అన్నాయాడన.
నేను ఆంజినేయులుకాడ అంచులకు నెమళ్లూ, గుళ్లూ, ఏనుగుల డిజైన్లూ నేసేది నేర్సుకుంటి. అంచులు కూడా 15 ఇంచీల వరకూ పెద్దవిగా నేసే విద్య పట్టు పడింది. అలంకారానికి రాళ్లూ, చమ్కీలు, కుందన్లు, సీక్విను (మెరిసే పదార్థం), బంగారు జరీ వాడేది జూసి షావుకార్లు ముచ్చటపడినారు. నేను నేసిన చీరలు లడ్డూలమాదిరీ అంగిళ్లలో అమ్ముడౌతావుండె. పెళ్లిళ్లకూ, గుళ్లూ, గోపురాలకూ పోయేదానికి, ఆడోళ్లు నేను నేసిన చీరలు కావాలని అడిగి తీస్కుంటా వుండిరి.
షావుకార్లు కొన్ని చీరలు విదేశాలకు అంపిస్తావుండిరి. ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాదులో షాపుళోళ్లు పనిగట్టుకోనొచ్చి నా పనితనం చూసి ఆడర్లు బారీగా ఇస్తా వుండిరి.
నాకు మజూరీ చీరకు ఎనిమిదొందల దాకా ఇస్తా వుండిరి. నెలకు పదీ, పన్నెండు చీరలు నేస్తా వుంటిని.
జొన్న అచ్చులతో నేసిన జాకెట్టు, డబుల్ కలర్ చీరలు, పాలిషింగ్ చేస్తే మెరుస్తా వుండె. కానీ రోజుకు పదీ, పన్నెండు గంటలు వాటు వేసిందానికి నాకు చూపు తగ్గి, గస, ఆయాసమూ, దగ్గూ పట్టుకొన్నాయి.
మంచి వానాకాలంలో గుంటలలో నీళ్లూరి, నేసిన పడుగంతా పాడైపోతావుండె. అట్టాంటప్పుడు మళ్లీ అంతా నెయ్యాల్సొచ్చేది. మా ఇంటామె పార్వతి, కూతురు కూడా కండెలు చుట్టేది, బుటాలు అతికేది సేస్తా వుండిరి. నేసే పనిలో ఇంట్లో అందరూ పని సెయ్యాల. కాళ్లూ, సేతులు కదపతా శ్రమ పడాల రోజంతా.
ఇప్పుడంటే జకార్డులు, అర్థ హెచ్ పీ మోటర్లు వచ్చి కొంచెం శ్రమ తగ్గింది. మారోజుల్లో ఆణ బలంగా తొక్కి వాటేయ్యాలంటే దేవుళ్లు కనపరస్తావుండె. మోకాళ్ల నెప్పులెత్తుకోని అవి తగ్గేదానికోసరం మగ్గాలోళ్లు చాలామంది మందు కొడ్తా వుండిరి.
నా చిన్న కొడుకు గోవిందు డిగ్రీ పాసై వుజ్యోగం కోసం ఇంటరూలకు పోతావుండె. ఒకతూరి రైల్లో వానికి సంపత్ కుమార్ అనే ఐద్రాబాదాయన పరిచయమైనాడు. ఆయన ఆడ బొటీకో ఏదో నడపతా వున్నాడు.
ఆయనకు నా గురించి సెప్పినాడు మావోడు.
“ మరీ గుంటమగ్గాల్లో ఎన్నేళ్లు కట్టపడినా బాగుపడరు. కట్టపడి కొత్త విజ్జలు నేర్సుకోవాల. నీ డిగ్రీకి నీకుజ్జోగాలు రావు. వచ్చినా నెలకు ఎనిమిది, పది వేల జీతంతో టౌన్లలో బతకలేవు.
మా బొటీకులో ఫేషను డ్రస్సులు, కురతాలు, పైజామాలూ ఇంకేందేందో గుడ్డలమ్మతా వుండాము. కలంకారీ సీరలు కావల్ల. నీకెట్టా మగ్గం పని వచ్చు కాబట్టి కాళస్తికి పొయ్యి కలంకారీ పని నేర్సుకో, నువ్వు నెలకు ఎన్ని చీరలు నేసినా, నేను మంచి మజూరీ ఇచ్చి తీస్కుంటా” అని ఆయన అడ్రస్సు, నెంబరు ఇచ్చినాడంట.
మావోడు ఆయన సెప్పినట్టే కాళాస్త్రిలో ఆరు నెలలుండి కలంకారీ పని నేర్సుకొనె. చీరలపైన రామాయణం, బారతం బొమ్మలు, హంసలు, నెమళ్ల డిజైన్లు నెయ్యడం తెల్సుకొనె.
సంపత్ కుమార్ దర్మారం వచ్చి ఆ చీరలను చూసి ‘శబాస్’ అని మెచ్చుకోని మంచి రేటుకి కొనుక్కోని పోయినాడు.
కలంకారీలో రసాయనాలు లేకుండా పూలు, ఆకులు, చెట్టుబెరళ్లు నుండి తీసిన రంగులు గుడ్డలకద్దుతారు కాబట్టి, ఒంటికి ఏమీ కీడు చేయవని పైదేశాల్లో ఈ గుడ్డలకి వల్లమాలిన డిమాండుండాదంట.
ఐనా ఆ రంగులద్దేదేమీ సామాన్యంగాదు. నీళ్లలో సోడా, సబ్బు ఏసి, నూలును నాలుగు గంటలు ఆ నీళ్లలోనే వుడకనిచ్చి ఒక రాత్రంతా అట్నే వుణ్ణీయ్యాల. తరువాతి రోజు ఆ నూలును జాడించి దానికి కరక్కాయ రసం పట్టించి, పిండి ఆరబెట్టాల. దానిమ్మచెక్క, మోదుగపువ్వు, తుమ్మచెక్క, రతన్ జ్యోతి లాంటిదేదైనా తొట్టిలోవేసి దంచి నీటిలో మరగబెట్టాల. దాంట్లో నూలువేసి జాగ్రత్తగా కలపాల. తరువాత ఆ నూలును బయటకు తీసి, పిండి ఆరబెట్టాల. దీనివల్ల ఎట్లాంటి నీటి కాలుష్యమూ రాదంట. కానీ ఆ పని జేసేవోళ ఒళ్లు హూనమైపోతుంది.
ఈ పీతాంబరాలను తయారు చేసేదానికి మావోడు గోవిందుకి దేవుళ్లు కనబడతా వుండిరి. సంపత్ కుమార్ అనంతపురం, దర్మోరంలోనూ బొటీకులు పెట్టి మావోడి కలంకారీ గుడ్డలతోబాటూ, నేను నేసిన పెళ్లి పట్టుచీరలు, పావడలు, డ్రస్సులు అమ్మకాలకు పెట్టినాడు. ఆ అంగిళ్లకు మంచి డిమాండు వచ్చి పడినాది.
ఏడేడనుంచో జనాలు వచ్చి, అడిగిన రేటు ఇచ్చి ఆ గుడ్డలు కొనుక్కోని పోతా వుండిరి. కొందరు శేట్లు బొంబాయి, డిల్లీనుండి గూడా వచ్చి లాటుగా గుడ్డలు కొంటా వుండిరి.
నేను ఒక మగ్గాల షెడ్డులో పది మగ్గాలు పెట్టి పట్టుచీరలు నేయిస్తా వుంటిని. మావోడు ఒక పన్నెండు మంది జీతగాళ్లను పెట్టి కలంకారీ రకాలు తయారుచేయిస్తా వుండే.
“నీకొచ్చిన లాభాలు ఈ షాపుకే ఖర్చుపెట్టు. సంవచ్చరంలో ఇంతకింత నీకు తిరిగిస్తాను. నా దగ్గిర డబ్బులు కొంచెం తక్కువగా వుండాది” అని సంపత్తు మావాడికి ఆయనిచ్చిన డబ్బంతా అరచెయ్యిలో సొరగం చూపించి లాక్కున్నాడు. గొర్రె కసాయోణ్ణి నమ్మినట్లు మావోడు వచ్చినడబ్బంతా వాడి చేతిలో పెట్టె.
“అబ్బా, కొడుకులింత సంపాదిచ్చావుండామంటారు. ఒక్క ఇల్లు ఆ జాగాలో కట్టుకోలేకుండా వుండాం. మనకీ యాపారాలొద్దు. వచ్చిందాంతో గునాతాలు తీసి ఇల్లు మొదలు పెట్టు” అని మా ఇంటామె పోరాడతానే వుంది. కానీ మా ఇద్దరి మాటా మావోడు గోవిందు పడనీకపాయె.
ఒక తూరి సంపత్తు డబ్బు రాబట్టుకోని పోయినోడు ఇంగ రానేలేదు. వాడి నెంబరు స్విచ్చాఫ్ అనే వస్తా వుంది. మావోడు ఐద్రాబాదుకు కూడా పోయి చూసినాడు. వాడెందరికో ఎగనామం పెట్టేసి బోర్డుతిప్పేసి పూడ్సినాడంట.
అంగళ్లకు మూడునెల్ల బాడుగ కట్టాల. పనోళ్లకు జీతాలియ్యాల. కరెంటు బిల్లు, పన్ను బిల్లు... నాకేం జెయ్యాలో తోచలా.
అప్పుడే అనంతపురంలో మా బొటిక్కు వచ్చిన జడ్జికి నేను నేసిన బ్రొకేట్ చీరలు బాగా నచ్చి ఆయన కూతిరి పెళ్లికి చీరలన్నీ మా షాపులోనే కొన్నేడు. అంతేగాకుండా ఆ చీరలు నేను నేసినానని తెల్సుకోని కలెక్టరుకు, చేనేత శాకోళ్లకూ చెప్పి, ‘ఈ ఓబులేసుపేరు పద్మశ్రీ అవార్డుకు అంపండి’ అని పోరి వాళ్లతో దరకాస్తు పంపించినాడు.
నిపుణులైన అదికారులు డిల్లీనుండొచ్చి నా మగ్గాలనూ, నేను నేసిన చీరలను చూసి, మెచ్చుకోని నా పేరు ఈ అవార్డుకు సిఫార్సు చేసినారు. వాళ్లందరికీ దండాలు పెడ్తున్న.
యాపారంలో నట్టం మేమెట్టనో పూడ్సుకుంటాము. చేతిలో దేవుడిచ్చిన విద్దెండాది. నేను మీకంతా చెప్పేది ఒకటే.
చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబందించింది. చీర వల్లెనే భారతదేశానికి చెందిన ఆడోళ్లకు విదేశాల్లో గౌరవం. చేనేత చీరలు, పట్టుచీరలు కొనండి. మీ కూతుళ్లకు వారానికి ఒకసారైనా చీరకట్టేది అలవాటు చేయండి.
మగోళ్లైనా వారానికి ఒకసారైనా ఏ పొందూరు ఖద్దరో, నారాయణవరం పంచెలో, దోతీలో వేసి చూడండి. ఆ హాయి వేరు. అట్నే మీరు మగ్గాళ్లోల్లను బతికించినోళ్లవతారు. మన ప్రాచీన కళ చేనేతను కాపాడండి. అందరికీ నమస్కారం” అని కంటి నిండా నీరుతో ఓబులేసు చేతులు జోడించాడు.
సభ కరతాళ ధ్వనులతో దద్దరింల్లింది.
రాష్ట్రపతి చప్పట్లు చరిచి, ఓబులేసును భుజం తట్టాడు.
“విన్నారు కదా, చేనేత కళ మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం. అనాదిగా మనదేశం ఈ కళకు పెట్టింది పేరు. కొడిగడ్తున్న ఈ దీపానికి వూపిరి పోస్తాం. మన దేశ ప్రాభవానికి చిహ్నమైన ఈ కళ అంతరించిపోకుండా చూసే బాధ్యత మీదీ, నాదీ, మనందరిదీ” అన్నాడు రాష్ట్రపతి.
సభలో మరొకసారి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.
