అతడొక తెలుగు వెలుగు వేగు చుక్క

నవయుగ కవి చక్రవర్తి: కలంతో రాస్తున్న గురజాడ అప్పారావు, వెనుక ఆనాటి సమాజ దృశ్యాలు

అతడొక తెలుగు వెలుగు వేగు చుక్క

అభ్యుదయ కవనాల తురుపు ముక్క

తెలుగు కవన వీధుల సూర్యుడతడు

వెలుగు సంస్కరణ తీరుల ధీరుడతడు

కవి శేఖరుడుగా తెలుగున వెలిగినవాడు

గురజాడ అప్పారావుగా నవ కవనాలరేడు

మనసాంఘిక దురాచారాలను

దండించిన వాడు

సతీసహగమనాన్ని చండాడి

ఖండించినవాడు

బాల్యవివాహాల పుత్తడి బొమ్మను

చెక్కిన వాడు

మూఢాచారాల కన్యాశుల్కమును

నిరసించినవాడు

అతడొక సాహితీ సవ్యసాచి

కథ నాటక కవితలకు దిక్సూచి

హేతువాది ప్రగతి శీల వాది

వ్యవహారిక భాషకతడు పెన్నిధి

గిడుగుతో అడుగులు వేసిన ఘనుడు

తిక్కన వేమనల జోడుగా నిలిచినవాడు

దేశమంటే మట్టి కాదన్నవాడు

దేశమంటే మనుషులన్నవాడు

మంచి చెడులే కులాలన్నవాడు

దిశ దిశలా సంస్కరణల మార్గదర్శితడు

తెలుగువాడుగా మనకు ధన్యుడతడు

మహాకవిగా మనకు వర మాన్యుడతడు

తెలుగు కవనాన ప్రగతి అడుగు

మన గురజాడ వారి తొలి అడుగు

తలపాగా కట్టిన తెలుగుకు తలకట్టు

జనుల భాషకు ఆసరా వారి పంచెకట్టు

అందుకే........

మన హితుడైన

ఘన చరితుడైన

గురజాడ వారి అడుగులకు

నుడి జాలువారు పలుకులకు

ఇవే మన ఘన తెలుగు వెలుగు జాతి ఖ్యాతి రీతి నతులు నతులు

సంపుటి 44 · సంచిక 5 · సెప్టెంబర్ – అక్టోబర్ · 30 సెప్టెంబర్, 2026