ఓ నాన్నా! నీ మనసే వెన్నా…
“ఓ నాన్నా! నీ మనసే వెన్నా! అమృతం కన్నా… అది ఎంతో మిన్నా!”
‘నాన్నల దినోత్సవం’ సందర్భంగా టీవీలో ప్రత్యేక కార్యక్రమం చూస్తున్న సంజయ్, పకపకా నవ్వాడు. పక్కనే ఉన్న రవి,“ఏమైంది? అంత నవ్వు వచ్చే విషయం ఏముంది ఆ పాటలో?” అన్నాడు.
“ నాన్నల మనసు వెన్న అంటే నవ్వొచ్చింది. అలా వెన్న కాబట్టేగా, కరిగి ఆజ్యం అయిపోయి,
హోమంలో సమిధగా మండిపోయి, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో తేలాను!” మళ్లీ నవ్వసాగాడు.
“ఏం చేస్తాం? పిల్లలమీద గుడ్డి ప్రేమా? తెలివి తక్కువతనమా? ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చి ఇక్కడ అఘోరిస్తున్నావు!” రవి అన్నాడు.
అది ఒక ఖరీదైన ఓల్డ్ ఏజ్ హోమ్. అన్నీ ఏసీ రూములు. ఇష్టమైతే ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు, లేదంటే ఒక్కరే ఉండచ్చు.
ఎవరి రూమ్‌లో వాళ్ళకి టీవీ, ఫ్రిడ్జ్, ఒక స్టవ్… ఇంకా అవసరమైన సామానులు ఉన్నాయి.
కామన్ డైనింగ్ రూమ్, కావాలంటే రూమ్‌కి సప్లై, వాకింగ్ ట్రాక్, పెద్ద హోమ్ థియేటర్, క్లబ్… సదుపాయాలన్నీ… వైద్యంతో సహా ఉన్నాయి.
అక్కడ చాలామటుకు, విదేశాల్లో పిల్లలు ఉన్న తల్లితండ్రులు, మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యిన జంటలు, జంటలో ఒకరు పోయి ఒంటరిగా మిగిలిన వాళ్ళు ఉన్నారు.
సంజయ్, రవి ఇద్దరూ యూనివర్సిటీలో ప్రొఫెసర్లగా చేసి రిటైర్ అయ్యారు. ముందు నుంచి పరిచయం ఉండటంతో, ఇద్దరూ ఒకే రూంలో ఉంటున్నారు.
రవి పిల్లలు ఇద్దరూ, అమెరికాలో ఉండడంతో, భార్య చనిపోయాక పిల్లల దగ్గరికి వెళ్తే, అక్కడ జీవిత శైలి, వాతావరణం, రవికి నచ్చలేదు. అలా అని, ఒక్కడూ, ఇంట్లో, పనివాళ్ళతో మేనేజ్ చెయ్యలేకపోయాడు. అదే సమయంలో, ఆరోగ్యానికి సంబంధించి చిన్న సమస్య రావడంతో, ఒంటరిగా ఉండలేక, ఓల్డ్ఏజ్ హోమ్‌లో చేరాడు. ఇది ఒక అయిదు నక్షత్రాల హోటల్‌కి తీసిపోదు. ఇక్కడికి వచ్చాక ఒంటరితనం పోయి ఆరోగ్యం బాగుపడింది.
అవే ఆలోచనల్లో ఉన్న సంజయ్‌కి, తను ఇక్కడకి చేరాల్సిన పరిస్థితి గుర్తుకువచ్చింది.
పెళ్లికి, సంజయ్ జూనియర్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేస్తున్నాడు. సంజయ్ డాక్టరేట్ కోసం రీసెర్చ్ లో బిజీగా ఉంటే, ఇల్లు బాధ్యత, పిల్లల చదువులు, అన్నీ అతని భార్య మాలతి చూసుకునేది.
సంజయ్‌కి భార్యాపిల్లలంటే విపరీతమైన ప్రేమ. ఏనాడూ, వారిని విసుక్కునేవాడు కాదు. మాలతి, పిల్లలు కూడా సంజయ్ అంటే ప్రాణం పెట్టేవారు.
డాక్టరేట్ రాగానే యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది సంజయ్‌కి.
యూనివర్సిటీ దగ్గరగా ఫ్లాట్ కొని అందులో ఉండేవారు.
అంచెలంచెలుగా ఉద్యోగంలో ఎదుగుతూ, పిల్లలు పెద్ద వాళ్ళు అవుతున్నారని, ఇంకో పెద్ద ఫ్లాట్ కొని అందులోకి మారిపోయారు. పాత ఫ్లాట్ అద్దెకిచ్చారు.
లహరి, సాకేత్, చదువులయ్యి ఉద్యోగాల్లో చేరారు. రిటైర్ అయ్యేలోగా పిల్లల పెళ్లిళ్లు కూడా చేశాడు.
లహరి, ఇంట్లో పనులు చేసుకుని ఆఫీస్‌కి వెళ్ళలేదని, తను ఉన్న కాంప్లెక్స్ లోని ఇంకో అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని, కాపురం పెట్టించాడు.
“పిల్లలని ఇంత గారాబం చెయ్యకూడదు. ఇలా మనం అలవాటు చేస్తే, అమ్మాయికి పనులు ఎలా వస్తాయి? వాళ్ళ అత్తగారు వాళ్ళతో ఉండనివ్వండి, దూరం అయినా అక్కడ ఉండడం విధాయకం. అక్కడ ఉంటే వాళ్ల పద్ధతులు నేర్చుకుంటారు” అని చెప్పిన మాలతి మాటలు కొట్టిపారేశాడు సంజయ్.
“నా కూతుర్ని యువరాణిలా పెంచాను, అది కష్టపడితే నేను చూడలేను!” తండ్రి మాటలకి“మా నాన్న బంగారు! అమ్మే రాక్షసి!” అంది లహరి నవ్వుతూ
“అవును! ఆ రాక్షసి చేసిన వంటలే తింటున్నావు ఈరోజుకీ నువ్వు!” అంది మాలతి.
రెండేళ్లకి మనవలు పుట్టారు, సంజయ్ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యాడు.
మనిషిని పెట్టుకుని ఇద్దరు మనవలను పగలంతా చూసుకునేది మాలతి. ఎంత సాయం ఉన్నా, ఇందరికి వంటపని, పిల్లలపని చేసేసరికి, విపరీతమైన అలసట వచ్చేది మాలతికి.
రాత్రి పూట కూడా తనదగ్గర పిల్లల్ని వదిలి వెళ్తున్న కోడలికి, కూతురికి,“రాత్రన్నా మీరు ఉంచుకోండి!” అని చెప్దామంటే ఒప్పుకునే వాడు కాదు సంజయ్.“వాళ్లకు ఆఫీస్‌లో బోలెడు పని, టెన్షన్స్. మంచి నిద్ర లేకపోతే కష్టం, పని అమ్మాయి ఉందిగా!” అనేవాడు. ఆ అమ్మాయి, రాత్రి ఒళ్లు తెలీకుండా నిద్ర పోయేది. మాలతికి, మధ్యాహ్నం పడుకోడానికి ఎంత ప్రయత్నించినా కుదిరేది కాదు.
ఇదిలావుండగా, సంజయ్ తండ్రి స్థలం, అన్నదమ్ములు పంచుకుంటే, వీళ్ళ వంతు కింద అయిదువందల గజాలు వచ్చాయి.
సంజయ్ అందులో పిల్లలకి ఇల్లు కట్టిద్దామంటే మాలతి ఒప్పుకోలేదు.
“ఎవరి స్థలం వాళ్లకి ఇవ్వండి, వాళ్ల ఇష్టం, కట్టుకుంటారో, అమ్ముకుంటారో! ఉన్న డబ్బులన్నీ దానికే పోతే, మనకంటూ మిగలవు. జీవిత చరమాంకంలో, పిల్లలని డబ్బులు అడగకపోతేనే మన మర్యాద నిలుస్తుంది” అని చిలక్కి చెప్పినట్టు చెప్పింది.
సంజయ్ వింటేనేకదా! పిల్లలమీద పిచ్చిప్రేమా, అతి నమ్మకం! రిటైర్మెంట్ డబ్బులు పెట్టి, ఇద్దరి పేరు మీదా, చెరో ఇల్లు కట్టించి, గొప్పగా పిల్లలకి బహుమతిగా ఇచ్చాడు. రెండు ఫ్లాట్లు అద్దెకి ఇచ్చి సాకేత్ తో ఉన్నారు.“ఫ్లాట్లు కూడా అమ్మి పిల్లలకి డబ్బు పంచుతాను! ఎటూ సాకేత్ దగ్గరే ఉంటాం కదా! పై ఖర్చుకు మన పెన్షన్ సరిపోదా!” అని సంజయ్ అంటే, అలా చేస్తే, మాలతి ఉరేసుకుని చస్తానని బెదిరించింది. పిల్లలు కూడా, రానురాను ధరలు పెరుగుతాయని, అద్దెకిమ్మని చెప్పారు.
ఇదివరకు, పైనా, కిందా, ఉన్న పిల్లలు ఇప్పుడు పక్కపక్కన ఉంటున్నారు. మాలతి చాకిరీలో మార్పులేదు. ఎటొచ్చీ, మనవలు ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు. ఆ రెండు గంటలు మాత్రం, మాలతికి తెరిపి ఉండేది.
ఈ మధ్య బాగా నీరసంగా ఉంటోందని, గుండెదడగా ఉంటోందని, ఒకటి, రెండుసార్లు, డాక్టర్ దగ్గరికి వెళ్దామని సంజయ్‌ని అడిగితే, పిల్లలకి సెలవలు ఉన్న రోజున వెళ్దామన్నాడు. ఆ రోజు ఉదయం మాలతికి అసలు బాగాలేదు, మంచం మీదనుంచి లేవలేకపోయింది.
కోడలిని ఇంట్లో ఉండమని అడిగితే, అవసరమైన మీటింగ్ ఉందని చెప్పింది. కూతుర్ని ఉండమంటే, అత్తగారి వేపు ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయింది.
ఊపిరాడక ఇబ్బంది పడుతున్న మాలతిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేసరికి,“ఇంత ఆలస్యంగా ఎందుకు తీసుకొచ్చారు? ఆవిడకి హార్ట్ ఫెయిల్యూర్!” అని డాక్టర్లు సంజయ్‌ని తిట్టారు. సాయంత్రానికి మాలతి కన్నుమూసింది.
సంజయ్‌కి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. మాలతి ఏనాడూ నాలుగురోజులు మంచమెక్కింది లేదు. ఈమధ్యే, నాలుగయిదుసార్లు, బాగాలేదు డాక్టరు దగ్గరికి వెళ్దామని అడిగింది. అలాంటిది, ఇలా అకస్మాత్తుగా మరణించడం ఏమిటి? మాలతి కన్నా, తానే ముందు పోతాననే ఉద్దేశ్యంలో ఉన్నాడు సంజయ్.
పిల్లలు కూడా చాలా షాక్ లోకి వెళ్లారు.
“అమ్మకి బాగా లేదంటే ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడమేమిటి? మాతో చెప్తే మేమన్నా తీసుకెళ్లేవాళ్ళం కదా!” అన్నారు కొడుకు, కూతురు ఏడుస్తూ. ఆ రోజు పొద్దున్నే ఇద్దర్నీ అడగడం, వాళ్ళు కుదరదని వెళ్లడం, వాళ్ళు తేలిగ్గా మర్చిపోయారు.
మాలతి పోవడంతో, సంజయ్ కష్టాలు మొదలయ్యాయి.
ఇప్పటివరకు, అందరికీ మాలతి వంట చేసేది. ఇప్పుడు, నేనెందుకు చెయ్యాలంటే, నేనెందుకు చెయ్యాలని, కూతురు, కోడలు గొడవలు పడ్డారు. ఇద్దరి వంటలూ వేరయ్యాయి.
సంజయ్‌కి, వారానికి మూడు రోజులు కూతురు, మూడు రోజులు కోడలు, వండిపెట్టే ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరూ మర్చిపోయిన విషయం, వారానికి ఏడురోజులని!
ఇదివరకటిలాగా, మనవలు స్కూల్ నుంచి వస్తే, సంజయ్‌కి ఏం చెయ్యాలో కూడా తెలిసేది కాదు. అంతా ఆమే చూసుకోవాల్సి వస్తోందని, పని ఎక్కువైంది కనక జీతం పెంచమని కూర్చుంది పిల్లల్ని చూసే మనిషి.
ఆ జీతం కూడా సంజయ్ ఇవ్వాల్సి వచ్చేది.
అటు కూతురు, ఇటు కోడలు, సరుకులు తెమ్మని, కూరలు తెమ్మని చెప్పేవారు, ఒక్క పైసా ఇచ్చేవారు కాదు.
సంజయ్‌కి మాలతి చెప్పిన ప్రతీ మాటా, రోజుకి పదిసార్లు గుర్తొస్తోంది.
“ఎవరి ఇల్లు వాళ్ళకి ఉంటే, పని, డబ్బు…బాధ్యతలు తెలుస్తాయి! ఆడపిల్లకి కొద్దిగానైనా వంట రావాలి!” ప్రతీసారీ తనే అడ్డం చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు పెట్టే గడ్డి తినలేక, తిన్నది సరిపోక, ఏదైనా చేసుకుంటే,“పొద్దున అన్నీ వండానుగా! ఈ మధ్య ఆకలి ఎక్కువయింది మీ నాన్నకి!” కోడలి సణుగుళ్ళు గుండెలో గుచ్చుకున్నాయి. కూతురయితే,“ఆ తిండి యావ ఏంటి నాన్నా!” మొహం మీదే విసుక్కునేది. సంజయ్ దగ్గర కూచుని, రెండు మాటలు మాట్లాడడానికి ఎవరికీ టైం లేదు.
సరైన తిండిలేక, మాట్లాడే మనిషి లేక, నాలుగునెలల్లో జబ్బు పడ్డట్టు అయ్యాడు.
ఒక రోజు కూరలకి వెళ్లి, ఆకలి తట్టుకోలేక, దగ్గర్లో హోటల్‌కి వెళ్లి టిఫిన్ తింటుంటే కనిపించాడు రవి. సంజయ్‌ని చూసి ఆశ్చర్యపోయాడు.
ఎప్పుడూ టిప్ టాప్ గా ఆరోగ్యంగా ఉండే అతను, ఇలా అయిపోవడమేమిటని బాధపడ్డాడు.
పలకరించే మనిషి లేక అల్లాడుతున్న సంజయ్, రవితో మనసు విప్పి మాట్లాడాడు.
“నా భార్య పోయి ఏడాదిన్నర అయింది సంజయ్! మా పిల్లలిద్దరూ అమెరికాలోనే! వాళ్ల బలవంతం మీద ఆరునెల్లు అక్కడికి వెళ్లి, అడ్జస్ట్ అవలేక మూడు నెలల్లో వచ్చేశాను. కొంత కాలం పనిమనిషి, వంటమనిషితో నడిపించాను. అది కూడా కష్టమే. అందుకని ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేరాను. నా ఇల్లు అద్దెకి ఇచ్చాను. నాకొచ్చే పెన్షన్, అద్దె కలిపి హాయిగా సాగిపోతోంది. ఒంటరితనం లేదు. నువ్వు కూడా చూడు! నచ్చితే ఇద్దరం రూమ్ షేర్ చేసుకుంటే, ఇంకా తక్కువ అవుతుంది” అన్నాడు.
మర్నాడే వెళ్లి చూసాడు సంజయ్.
ఎంతో నచ్చి, అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి వచ్చి పిల్లలకి చెప్పాడు. ముందు“ఎందుకు నాన్నా?” అన్నా, ఇతని బెడద వదులుతుందని“సరే!” అన్నారు.“రెండు ఫ్లాట్ల అద్దె నేనే తీసుకుంటాను!” అని సంజయ్ అన్నప్పుడు“ఎంతకాలం బతుకుతాడు? తర్వాత ఆ ఫ్లాట్స్ మనకేగా!” అని ఊరుకున్నారు.
కుదిరినప్పుడు పిల్లలు రావడం, ఎప్పుడైనా ఒకరోజు సంజయ్ వెళ్లడం, రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. సంజయ్‌కి టైంకి అన్నీ అమరుతున్నాయి, కంపెనీకి రవి ఉన్నాడు.
ఇద్దరూ, మధ్యమధ్యలో, ఏదో ఒక టూర్ కూడా వెళ్తున్నారు. ‘ఈ పని మాలతి ఉన్నప్పుడు చేస్తే ఎంత బాగుండేది! ’ అనుకోని క్షణం లేదు. పాపం మాలతి మొత్తుకునేది,“ఎన్ని రోజులు మనకి ఈ బాధ్యత? ఓ ఊరూ లేదు, ఓ గుడీ లేదు, జీవితమంతా చాకిరీ సరిపోతోంది”. అప్పుడు పట్టించుకోలేదు, పైగా,“ మన పిల్లలకి చెయ్యడానికి ఏడుస్తావేంటి?“ అని విసుక్కునేవాడు. ఇప్పుడు అర్థమైనా చెయ్యగలిగింది లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఇదే!
ఆలోచనల్లో ఫోన్ మోగింది గమనించ లేదు సంజయ్.
“నీ పుత్రరత్నం!” అని ఫోన్ ఇచ్చాడు రవి.
“హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా!” అన్న కొడుకుతో“నీకూ హ్యాపీ ఫాదర్స్ డే. నువ్వూ ఇప్పుడు తండ్రివేగా!” అన్నాడు. సాకేత్‌కి ఎక్కడో తగిలింది.“ఇవాళ మీరు వస్తారనుకున్నాం!”“లేదురా! ఇవాళ మంచి ప్రోగ్రాములు ఉన్నాయి! వచ్చే వారం, నేను, రవి అంకుల్, యాత్రకి వెళ్తున్నాం!” ఒక్క క్షణం ఆగి,“నువ్వు, లహరి ఫ్యామిలీ తో కలిసి రండి! డిన్నర్ ఇక్కడే చేసి వెళ్ళచ్చు, మీకు మంచి సర్ప్రైజ్ కూడా ఉంది!” అన్నాడు.
సంజయ్ పిల్లలు మాంచి హుషారుగా వచ్చారు.
సాయంత్రం, హోమ్‌లో అందరూ సమావేశమైనప్పుడు, అక్కడున్న వారు కొందరు మాట్లాడితే, కొందరు పాటలు పాడారు. సెక్రటరీ మాట్లాడుతూ,“మీకు తెలిసిన వారు ఎవరైనా, ఒంటరిగా ఉండి ఇబ్బంది పడుతున్న వృద్ధులు ఉంటే, మన హోమ్ లో చేర్పించండి. వారు ఆర్థికంగా ఇక్కడ కట్టవలసింది కట్టుకోలేని స్థితిలో ఉన్నా, మన సభ్యులు కొంత ఫండ్ ఏర్పాటు చేసి, అలాంటివారు ఇక్కడ ఉండే ఏర్పాటు చేద్దామనుకుంటున్నారు” అందరూ సంతోషంతో కరతాళధ్వనులు చేసారు.
“ మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఒక వృద్ధుడికి, ఒక రోజు ఖర్చు అయినా సరే ఇవ్వచ్చు.
అలా, తనవంతుగా భూరి విరాళం ఇచ్చి, ఇక్కడే మన మధ్య ఉన్న సంజయ్‌గారు, తన గొప్ప మనసుని చాటుకున్నారు. తన ఫ్లాట్స్ మీద వచ్చే అద్దెని, ప్రతీ నెలా ఆ ఫండ్‌కి ఇవ్వడమేకాక, తన మరణానంతరం,
ఆ ఫ్లాట్లు రెండూ హోమ్‌కి చెందేటట్లు వీలునామా వ్రాసారు”.
అందరూ నిల్చుని చప్పట్లు కొట్టారు.
సంజయ్ నవ్వుతూ చూస్తుంటే, అతని కుటుంబం బిత్తరపోయి చూస్తున్నారు.
“మాకు ఒక్కమాట కూడా చెప్పకుండా…” కొడుకు మాటలకి అడ్డు తగుల్తూ,“అది పూర్తిగా నా స్వార్జితం!” అన్నాడు. వచ్చి మాట్లాడమని ఆహ్వానిస్తే ముందుకు వెళ్లి,
“ అవును! నా భార్య పోయాక, ఒంటరితనం అనే నరకం అనుభవించిన నేను, మరి కొందరైనా ఆ బాధ అనుభవించకుండా ఈ ఏర్పాటు చేసాను.
ఇక్కడ ఉండడానికి, డబ్బు కట్టుకోలేనివాళ్ళని, ఒక్కరినైనా, నేను పోషిస్తే నా జీవితం ధన్యం!“ చప్పట్లు మారుమోగాయి.
వెనకాల మళ్లీ పాట వినిపిస్తోంది“ఓ నాన్నా! నీ మనసే వెన్నా!” దూరంగా సాకేత్, లహరి కుటుంబంతో, కోపంగా బయటికి నడవడం చూసి నవ్వుకున్నాడు ఆ వెన్న మనసు నాన్న.
