మృదంగం: సిద్ధాంతమే స్పర్శైతే
కర్ణాటకసంగీతంలో ప్రధానమైన లయవాయిద్యం మృదంగం. కానీ ఒక మామూలు డ్రమ్ గా దీనిని భావిస్తే, సరిగా అవగాహన చేసుకోనట్టే. మృదంగం అంటే ఒక లయ, ఒక నాదం, ఒక భాష, ఒక సహవాయిద్యం, ఒక గణన, ఒక కళాత్మక సంభాషణ. ఒక మార్దంగికుడు చేసే పని కేవలం ఈ వాయిద్యాన్ని వాయించటం మాత్రమే కాదు. మృదంగాన్ని మచ్చిక చేసుకుంటాడు, శృతిచేస్తాడు, లాలిస్తాడు, పట్టు-విడుపు నేర్పుతాడు, మాట్లాడిస్తాడు.
ఈ చర్మవాయిద్యానికి ఒక ప్రధాన శరీరం, రెండు పక్కలు ఉంటాయి. ప్రధాన శరీరం రెండు పూలకుండీలకి అడుగు తీసేసి పై భాగాలని కలిపి అతికినట్లుగా ఉంటుంది. బారెల్ ఆకారంలో ఉండే ఈ ప్రధాన శరీరం ఒకే దిమ్మెతో, పనస చెక్కతో కానీ మరే గట్టి చెక్కతో కానీ చేస్తారు. దీనిని 'కట్టె' అని కూడా అంటారు. ఇరువైపులా రంధ్రాలు కలిగి ఉంటుంది [1, 2] రెండు వైపుల ఉన్న రంధ్రాలకి చర్మాలని అతుకుతారు. వాటిక చుట్టూ పచ్చి చర్మపు జడలతో అల్లటం సంప్రదాయంగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో సీలలతో బిగించటం జరుగుతోంది. దీనివల్ల శృతిచేయటంలోను, వాడకంలోను సౌలభ్యం పెరిగింది.
కుడి చేతి వాటంగల మార్దంగికుడికి సాధారణంగా కుడివైపు చిన్నదిగా ఉంటుంది. దీనిని “కుడి తల” అంటారు. దీనిని ముఖ్య విద్వాంసుడి ఆధారశృతిని బట్టి శృతిచేస్తారు. దీనికి మధ్యభాగంలో “కరణి” అనే నల్లని వలయాకారపు పూత ఉంటుంది. సాంప్రదాయకంగా దీనిని ఇనుమును కాల్చే కొలిమిలో ఉండే చిట్టెపురాళ్ళను మెత్తటి పొడిగా చేసి, దాన్ని గానీ, ఐరన్ ఆక్సైడ్, మాంగనీస్ డయాక్సైడ్ ను గానీ ఉడికిన అన్నంతో కలిపి ఉండగా తయారుచేసి, ఆ మిశ్రమాన్ని జాగ్రత్తగా పొరలుపొరలుగా అద్దుతూ తయారుచేస్తారు. బరువుగా ఉండే ఈ మధ్యభాగమే మృదంగానికి సుశ్రావ్యమైన ధ్వనిని (tonal clarity), నాదాన్ని (resonance) అందిస్తుంది.
కుడి తల లో అనేక చర్మపు పొరలు ఉంటాయి. ఈ పొరలను “కచ్చి” (చిన్న కర్రల) తో గానీ, “కప్పి” (చిన్న రాళ్ళ)తో గానీ విడమర్చి ఉంచుతారు. దానివల్లనే ఈ వాయిద్యానికి అపూర్వమైన కంపన చేకూరుతుంది. సంప్రదాయకంగా వాడుతున్న ఈ పదార్థాలకు బదులు వైరును వాడటం డా. టీ.వీ. గోపాలకృష్ణన్ గారి అద్భుతసృష్టి. నిర్మాణంలోని ఈ వైవిధ్యాలవల్ల ధ్వనిలోను, ప్రతిస్పందనలోను, నాదంలోను తేడాలు కనిపిస్తుంటాయి. కళాకారులు తమ శైలిని బట్టి, నాదప్రాధాన్యతను బట్టి మృదంగాన్ని ఎంచుకుంటారు.
దీనికంటే వెడల్పుగా ఉండే ఎడమపక్క తలను “తొప్పి” అంటారు. దీనిని శృతిచేసే విధానం వేరు. దీనినుండి గంభీర నాదాన్ని రప్పించటంకోసం రవ్వను ఉపయోగించి ఒక తాత్కాలిక పూతను ఏర్పాటుచేస్తారు. సౌకర్యం కోసం, స్థిరత్వాన్ని పెంచటం కోసం ఈరోజుల్లో చాలామంది విద్వాంసులు, ప్లంబర్లు నీళ్ళా కొళాయీల మీద వాడే పుట్టీ లాంటి “ప్లాస్టిక్ ఫర్మిట్” వాడుతున్నారు. ఎడమ మూతవల్ల మృదంగధ్వనికి గాంభీర్యం, స్థితిస్థాపకత పెరిగి, తద్ద్వారా మృదంగభావం మరింత ప్రస్ఫుటం అవుతుంది.
మృదంగాన్ని శ్రద్ధగా పరిశీలిస్తే, కేవలం ఒక లయవాయిద్యంగా కాక, శృతిలయలు మేళవించే ఒక సాధనంగా అర్థంచేసుకోవచ్చు.
శాన్ ఫ్రాన్సిస్కో కన్సర్వేటరీ ఆఫ్ మ్యూజిక్ కి చెందిన ప్రొఫెసర్ గ్రీన్బర్గ్ తాను రాసిన How to Listen to and Understand Great Music (గొప్ప సంగీతాన్ని వినటం, అర్థంచేసుకోవటం ఎలా) అన్న అంశంలో సంగీతాన్ని “sound measured in time” లేక “time measured by sound” (“కాలాన్ని కొలిచే ధ్వని లేక ధ్వనిని కొలిచే కాలం”) అని నిర్వచించారు. భారతీయ సంగీతజ్ఞులకు చిరపరిచితమైన సూక్తి కూడా ఇదే. “శృతిర్మాతా, లయః పితః” (శృతి తల్లి, లయ తండ్రి).
ఈ కలయిక మృదంగ నిర్మాణంలోనే ఉంది. కుడివైపు మూత ముఖ్య కళాకారుడి శృతికి అనుగుణంగా శృతిచేయబడి ఉంటుంది. అంటే లయలోనే శృతి ఇమిడి ఉన్నట్టు కదా? నాదప్రపంచానికి వెలుపల ఉండేది కాదు ఈ లయవాయిద్యం. అందులోనికే ప్రవేశించి, దానికి సహకరించేది. ఒక రకంగా చెప్పాలంటే, శృతిలో లయ కూడా ఉంది. తంబూరలో “పా-సా-సా-సా” అని వచ్చే పునరావృత ధ్వనిలో కూడా దీనిని వినవచ్చు.
శృతిలయలను ఒకే సిద్ధాంతానికున్న రెండు అవిభాజిత ఖండాలుగా, అర్థనారీశ్వరతత్త్వంతో చూడాలని శ్రీ ఉమయాల్పురం శివరామన్ గారు నాకు ఒకసారి చెప్పారు. ఆ ఊహ అద్వితీయమైనది. సంగీతపు రెండు పార్శ్వాలైన శృతిలయలు వేరువేరు విభాగాలు కావు. పరస్పర అన్యోన్య సహకార పూరకాలు.
తాళశాస్త్రంలో ఇది చాలా ముఖ్యమైన అంశం. శాస్త్రీయ సంప్రదాయంలో కాల, మార్గ, క్రియ అంగ, గ్రహ, జాతి, కాల, లయ, యతి, ప్రస్తారాలు అనే “తాళదశప్రాణాల” గురించి ప్రస్తావన ఉంది. ఇవి మననం చేసుకోవలసిన సైద్ధాంతిక విభాగాలు మాత్రమే కాదు. నిజమైన మృదంగకళాకారుడు అర్థంచేసుకోవలసిన, అలవరచుకోవలసిన, నియంత్రణ సాధించవలసిన జీవనసిద్ధాంతాలు.
కనుక, మంచి మృదంగవిద్వాంసుడికి ధ్వనిచేయటానికి మించి ఎంతో తెలిసి ఉండాలి. కాలం, స్థానం, నిర్మాణం, చలనం, ప్రవేశం, అంతర్విభాగం, నిష్పత్తి, గమనం, రూపం, విస్తరణ అన్నిటినీ అర్థంచేసుకోగలిగి ఉండాలి. ఈ సిద్ధాంతాలన్నింటినీ వినిపింపజేయటంలోనే కళ దాగి ఉంది. సిద్ధాంతాన్ని జీర్ణంచేసుకుంటే అది అభ్యాసంలో లీనమైపోతుంది.
మృదంగ వాదనశైలి చూడటానికి అతిసులభంగా ఉంటుంది. ఎడమవైపున అరచేయి మొత్తం వాడుతూ, కుడివైపున వేళ్ళను మాత్రమే వాడుతున్నట్టే ఉంటుంది. కానీ ఈ సరళమైన క్రియలోంచే అద్భుతమైన ధ్వని విశేషాలు జనిస్తున్నాయి. ఉదాహరణకి, ఒక వేలితో ఎడమవైపును కొడుతూ బొటనవేలి అడుగుభాగంతో తోలును మీటటం ద్వారా ‘గుంకీ’ అనే ధ్వని ఉత్పన్నమవుతుంది. సరైన ప్రావీణ్యతతో వాయిస్తే, మనిషి పాట పాడినట్టుగా, గాంభీర్యం, వయ్యారం కలిసిన ఒక ధ్వని వినవస్తుంది.
నిపుణుడైన మృదంగవిద్వాంసుడు డ్రమ్ రోల్ కి దీటుగా వాయించగలడు. కానీ ఈ వాయిద్యం విషయంలో కళ వేగానికి మాత్రమే పరిమితం కాదు. శిక్షణ, జ్ఞాపకశక్తి, ఊహాశక్తి, లయపరమైన మేధాశక్తి అన్నీ మేళవించి క్రమబద్ధమైన శబ్దాల యొక్క వరుసక్రమాలు, కలయికలతో కూడి ఉంటుంది మృదంగ వాదన. ఏ భాషలోనైనా ఎలాగైతే కొన్ని ధ్వని అక్షరాలు (phonetic elements) కలిసి అద్భుతమైన కావ్యాన్ని (poetry) సృష్టించగలవో, ఇక్కడ కూడా అంతే.
ఈ లయబద్ధమైన భాషను కొన్నొకోల్ అంటారు. కర్ణాటక సంగీతంలో లయాధారిత వాయిద్యాలు, అంశాలు, అంటే- ఘటం, కంజీరా, మోర్సింగ్, భరతనాట్య కూచిపూడి జతులు, మోహినీ ఆట్టం నట్టువాంగం, ఇలాంటివన్నీ ఈ భాషనే ఉపయోగిస్తాయి.
మృదంగం యొక్క ముఖ్యోద్దేశం కర్ణాటకసంగీతానికి లయను, ఖచ్చితత్వాన్ని ఇస్తూ సహకారవాయిద్యంగా విలసిల్లటం, కానీ అది మొదటి అంశం మాత్రమే. మృదంగం సంగీతానికి అలంకారమై దాని అందాన్ని ఇనుమడింపజేస్తుంది. మా గురువుగారు శ్రీ వెల్లూర్ రామభద్రన్ గారిది సహకారవాయిద్యశైలిలో అందెవేసిన చేయి. ఆయన శైలిని సర్వజనరంజకమైన “సర్వలఘు” శైలి అంటారు చాలామంది. కానీ నిజమైన సహకారవాయిద్యమంటే నిలకడగా లయసహకారం అందించటం మాత్రమే కాదని ఆయనే స్పష్టంచేశారు.
పక్కవాయిద్యం యొక్క మొదటి స్థాయి తాళానికి అనుగుణంగా వాయించగలగటం. ఆ పునాది లేనిదే ఏదీ నిలబడలేదు. కానీ దాని తరువాతి స్థాయి ఏమిటంటే, పల్లవిగానీ, అనుపల్లవిగానీ, చరణంగానీ, సమిష్టిచరణంగానీ (కర్ణాటక సంగీతంలో పల్లవి, అనుపల్లవిల తర్వాత వచ్చే మూడవ భాగాన్ని సమిష్టిచరణం అంటారు), ఆ పాడబడుతున్న అంశం యొక్క భావానికి తగిన గతిని సరిగ్గా పసిగట్టగలగటం. అది సమం నుంచి మొదలవుతోందా, అతీత గ్రహమా, అనాగత గ్రహమా, ఇవి పక్కవాయిద్యకారుడు గ్రహించాలి.
మూడవ స్థాయి మరింత కీలకమైనది. ఆ కృతి ముందుగా తెలిసి ఉండటం, అందులోని సాహిత్యాన్ని ఇనుమడింపజేసేలా వాయించగలగటం. ఈ స్థాయికి చేరాక కళాకారుడు తాళాన్ని అనుసరించి ఊరుకోడు, ఆయా ధాతువులను, మాతువులను, ఆ కృతి యొక్క భావగమనాన్ని కూడా అనుసరిస్తాడు.
ఇక ఆఖరి స్థాయి ఏమిటంటే, ఏయే విద్వాంసులు ఏ విధంగా అదే కృతిని ఆలపిస్తారో ఎరిగి ఉండటం. కర్ణాటకసంగీతంలో ఏ కృతీ అచంచలంగా ఉండిపోదు. పాఠాంతరాన్ని బట్టి ప్రకాశిస్తుంది. ఆయా కళాకారులు ఆ కృతిని నేర్చుకున్న, అలవరచుకున్న విధానాన్ని బట్టి, సంప్రదాయాన్ని బట్టి వైవిధ్యాన్ని కనపరుస్తుంది. నేర్పుగల మార్దంగికుడు కేవలం ఆ కృతిని అనుసరించటంతో సరిపెట్టడు. ఆయా కళాకారులు ఆ కృతిని ప్రదర్శించే విధానాన్ని అనుసరిస్తాడు.
అందుకే సహవాయిద్యకారుడికి సంగీతజ్ఞానం చాలా ప్రధానం. కర్ణాటకసంగీతంలో ప్రముఖమైన మనోధర్మసంగీతంలో ఇది మరీ ముఖ్యం. ఆలాపనలో లయవాయిద్యానికి తావులేదు. కానీ నెరవల్లో, కల్పనస్వరాల్లో, ఇతర మనోధర్మ అంశాల్లో మార్దంగికుడు ముందుగానే అవగాహన తెచ్చుకుంటూ ఉండాలి, వెంటనే ప్రతిస్పందించాలి, సంగీతగమనం ఎటో తెలుసుకొంటూ వ్యవహరించాలి. అప్పుడే సహవాయిద్యం కేవలం ఒక సహకారంగా కాక, ఒక సంభాషణగా గోచరిస్తుంది.
మృదంగంలోని మరొక ముఖ్యభాగం తని ఆవర్తనం (తన్యావర్తనం). ఇక్కడే లయవాయిద్యకారుడి ప్రతిభ వెలుగుచూసేది. తాళసూత్రాలకి కట్టుబడి ఉంటూనే, కళాకారుడు తన పాటవాన్ని ప్రదర్శించే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. శిక్షణ, ఊహాశక్తి, నియంత్రణ, గణితం అన్నీ కలిసి మేళవించేది ఇక్కడే.
తని ఆవర్తనంలో మృదంగ విద్వాంసుడు వివిధ రకాల నడకలు, అందులోని ఉప-విభాగాలు, వైరుధ్యాలు, విరామాలు, వేగంలో హెచ్చుతగ్గులు ఇవన్నీ పాటిస్తూ, లయ విన్యాసాన్ని ఆవిష్కరిస్తాడు. ఈ ప్రదర్శనలో ముత్యాల సరాలను పోలిన అల్లికలు కూడా ఉంటాయి. వాటిని “కోర్వై” అంటారు. విడివిడిగా ఉండే లయబద్ధమైన రత్నాలు అన్నీ కలిసి, ఒక పొందికైన, సంతృప్తికరమైన, సంపూర్ణమైన రూపంగా అల్లబడినట్లు అనిపిస్తుంది అద్భుతమైన కోర్వైని విన్నప్పుడు.
ఇలా వాయిస్తున్నప్పుడు గణనే సంగీతమై తాండవిస్తుంది. మేధాశక్తిని, సహజత్వాన్ని, నిర్మాణాత్మకతను, అపూర్వ ప్రయోగాలను, క్రమశిక్షణను, అద్వితీయమైన ఆనందాన్ని కళాకారుడు సమపాళ్ళలో కలగలపగా లయ ప్రాణంపోసుకుంటుంది.
మొత్తానికి అదే మృదంగంలోని అందం. సైద్ధాంతికంగా కఠినం అనిపించినా ఆచరణలో సజీవమైనది. దీని భాషకి హద్దులు ఉన్నాయేమో గానీ, భావం అపారమైనది. నిజమైన కళాకారుడి చేతిలో మృదంగం కేవలం సమయానికి కట్టుబడి ఊరుకోదు. కాలానికే ఆకారాన్ని, శక్తిని, అర్థాన్ని చేకూరుస్తుంది. మా గురువుగారి మాటల్లో చెప్పాలంటే, మృదంగం అనేది పక్క వాయిద్యం మాత్రమే కాదు, ఇదొక పక్కా వాయిద్యం.
