ప్రయత్నమే నీ గెలుపు

ప్రయత్నం చేయకుండా ఆగిపోకు మిత్రమా 

ప్రయత్నించడమే నీ మొదటి గెలుపు 

చుట్టూ ఉన్నవారికి భయపడి ఆగిపోతే అదే నీ ఓటమి 

వజ్రం నీ కాళ్ళ ముంగిటికి రాదు 

భూమి పొరలని చీల్చుకుంటూ 

మట్టి మనిషివై అన్వేషణ సాగించాలి

కాలంతో పోటీ పడితేనే 

కీర్తి శిఖరాన్ని అధిరోహిస్తావు

నిద్రాహారాలు త్యాగం చేస్తేనే

విజయుడివై నిలుస్తావు

విజేతకు సామాన్యుడికి తేడా స్పష్టం 

ఎవరూ అందుకోలేని నైపుణ్యం విజేత సొంతం

ఎవరూ భుజం తట్టలేదని ఎదురు చూడకు నేస్తమా

పడిపోతే ఎవరూ చేయి అందించరు సుమా 

కనిపించదు ఎవరికీ నీ ఆర్తి 

కావాలి నీకు నువ్వే స్ఫూర్తి

కరాలను ఖడ్గాలుగా మలచుకో

పదాలను జవనాశ్వాలుగా మార్చుకో 

ఊహించని వేగంతో దూసుకుపో 

కార్యక్షేత్రంలో అభిమన్యుడు నీవు 

కురుక్షేత్రాన పార్థుడు నీవు 

ప్రయత్నానికి ఎప్పుడూ ఓటమి అంటదు 

కార్యసాధకునకు అలుపు తగలదు

ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు 

మానసిక బానిసత్వం తప్ప

సంపుటి 44 · సంచిక 5 · సెప్టెంబర్ – అక్టోబర్ · 30 సెప్టెంబర్, 2026